గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి: వంగలపూడి అనిత
- అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్‌నాథ్
- మీ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న అనిత
- మహిళలను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావానలంలా మండుతున్నాయి. కూటమి ప్రభుత్వ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, తెలుగు మహిళా విభాగాలు అమర్‌నాథ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
అనిత సైతం దీనిపై స్పందిస్తూ... రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వారిపై తాను కచ్చితంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలా మాట్లాడే ముందు తమ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ఇష్యూపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇవి కేవలం ఒక హోంమంత్రిని అన్న మాటలు కావని.. యావత్ మహిళా జాతిని, వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ... ఒక దళిత మహిళ ఉన్నత పదవిలో ఉంటే ఓర్వలేక ఇలా కట్టు, బొట్టును టార్గెట్ చేస్తూ మాట్లాడటం.. వైసీపీ చేస్తున్న విషపూరిత, వికృత రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.